కేటాయింపులు జరిగేనా..? | - | Sakshi
Sakshi News home page

కేటాయింపులు జరిగేనా..?

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

నిబంధనల మేరకే ముందుకు..

జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం

● రూ.1.56 కోట్లతో నిర్మాణం

● ప్రారంభించి 8 ఏళ్లు పూర్తి

● నేటికీ టెండర్లు ఆహ్వానించని వైనం

–IIలో u

నారాయణపేట: జిల్లాకేంద్రం నడిబొడ్డున రూ.1.56 కోట్లతో నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయంలోని 26 దుకాణాలు ఎనిమిదేళ్లకుపైగా గడిచినా నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. 2018, ఫిబ్రవరి 17న అట్టహాసంగా ప్రారంభించినా.. నేటికీ వ్యాపారాలకు నోచుకోకపోవడం గమనార్హం. ఐదుగురు మార్కెట్‌ చైర్మన్లు మారినా కేటాయింపుల ప్రక్రియ కొలిక్కి రాలేదు. అటు చిరువ్యాపారులకు ఉపాధి అందక.. ఇటు మార్కెట్‌యార్డుకు ఆదాయం సమకూరక రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సముదాయం అలంకారప్రాయంగా మిగిలింది. మరోవైపు రైతుబజార్‌ కాంప్లెక్స్‌లో రూ.38 లక్షలతో నిర్మించిన 16 దుకాణాలకు సంబంధించి గతంలోనే కొందరు చిరు వ్యాపారులకు కేటాయింపులు జరిగాయి.

● పట్టణంలో వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన ప్రాంతంలో నిర్మించిన దుకాణ సముదాయంతో చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని, మార్కెట్‌యార్డుకు ఆదాయం సమకూరుతుందని భావించారు. నిర్మాణం పూర్తయినా దుకాణాలు ఖాళీగా ఉండటంతో ప్రజాధనంతో చేపట్టిన పనుల ప్రయోజనం అందుబాటులోకి రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదుగురు చైర్మన్లు మారినా..

2018 నుంచి 2026 వరకు నారాయణపేట మార్కెట్‌యార్డుకు ఐదుగురు చైర్మన్లు బాధ్యతలు నిర్వహించినా దుకాణాల కేటాయింపు సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. బండి వేణుగోపాల్‌ చైర్మన్‌న్‌గా ఉన్న సమయంలో నిర్మాణం పూర్తికాగా, అనంతరం సరాఫ్‌ నాగరాజు, వెంకట్‌రెడ్డి భాస్కరకుమారి, ఎం.జ్యోతి, ప్రస్తుత తాజా మాజీ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. పాలకవర్గాలు మారినా దుకాణాల వినియోగానికి సంబంధించి తుది నిర్ణయం వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే దుకాణాల కేటాయింపు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ప్రక్రియలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. టెండర్ల ద్వారా కేటాయించాలా? లేక రైతుబజార్‌లోని 16 దుకాణాల తరహాలో ప్రత్యేక అనుమతులతో కేటాయించాలా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేటాయింపు విధానంపై స్పష్టతనిచ్చి నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వాణిజ్య సముదాయంలోని దుకాణాల టెండర్ల ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రభుత్వ నిబంధనల మేరకే రిజర్వేషన్ల ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు చేపడతాం.

– బాలమణి, డీఎంఓ, నారాయణపేట

వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాల్లో 26 దుకాణాలు రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు రెండు, బీసీలకు ఆరు, దివ్యాంగులకు ఒకటి, జనరల్‌ కేటగిరీకి 13 దుకాణాలు కేటాయించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు సిద్ధమై ఐదేళ్లు గడిచినా కేటాయింపుల ప్రక్రియ ఎందుకు పూర్తికాలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. రిజర్వేషన్ల ఆధారంగా టెండర్లు నిర్వహించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement