పకడ్బందీగా వాల్టా చట్టం అమలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా వాల్టా చట్టం అమలు

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

నారాయణపేట: జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతుండటంతో భవిష్యత్‌ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భూగర్భ జలాలను పరిరక్షించేందుకు వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక గురువారం అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా బోర్లు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సుమారు 40 శాతం వర్షపాత లోటు నమోదవడం, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవడంతో నీటిఎద్దడి తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. భూగర్భ జలాల వినియోగం, కొత్త బోర్ల తవ్వకాలను నియంత్రించడంలో భూగర్భ జలశాఖ సాంకేతిక సంస్థగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఆ శాఖ అందించే సాంకేతిక నివేదిక ఆధారంగా తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును పర్యవేక్షించాలని వివరించారు. ఎన్‌ఓసీ లేకుండా బోర్లు తవ్వడం చట్టవిరుద్ధమని.. అక్రమ తవ్వకాలు గుర్తిస్తే తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు యంత్రాల జప్తునకు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విద్యుత్‌ కనెక్షన్ల తొలగింపు, క్రిమినల్‌ కేసులు, పర్యావరణ నష్టపరిహార రుసుం (ఈసీసీ) వసూలు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. బోర్ల తవ్వకాలకు అనుమతులు, సాంకేతిక సలహాలు, అక్రమ తవ్వకాలపై ఫిర్యాదుల కోసం జిల్లా భూగర్భ జలశాఖ అధికారుల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement