వాగులో గుంత తవ్వి..
మరికల్, ధన్వాడ మండలాల శివారులో ఉన్న కోయిల్‌సాగర్ వాగు పరీవాహక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నాలుగు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్నాయి. కోయిల్‌సాగర్ కాల్వ నుంచి సైతం నీటి విడుదల లేకపోవడంతో వరి పొలాలు ఎండుదశకు చేరుకుంటున్నాయి. పంటల్ని రక్షించుకోవడం కోసం వాగులో లోతైన గుంతలను (చెలిమలు) తవ్వి ఆ నీటిని మోటార్లతో పొలాలకు తరలించుకుంటూ చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఇతర మండలాల్లో కొత్త బోర్లు తవ్వినా నీరు పడకపోవడంతో రూ.వేలు వెచ్చిస్తూ ట్యాంకర్ల ద్వారా వరి పొలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
ఎల్‌నినో అన్నదాతల జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఓ వైపు పంటలు ఎండిపోతుండగా. మరోవైపు పశుగ్రాసం కొరత ఉత్పన్నం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 2014 నుంచి జిల్లాలో సంగంబండ, భూత్పూర్, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడంతో వలసలు ఆగిపోయాయి. వ్యవసాయంతో స్థానిక రైతులు స్థిరత్వం సాధించారు. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో నమ్ముకున్న కాడెద్దులు తెగనమ్మి రైతులు వలసబాట పడుతున్నారు.
మరికల్: జిల్లాలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతుండగా.. మరోపక్క విద్యుత్ కోతలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. వేసవిని తలపించేలా ఎండలు మండిపోవడంతో సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ట్యాంకర్లతో నీరందిస్తుండగా.. మరికొందరు అదనపు బోరుబావులను తవ్వి ఎండుతున్న పంటల్ని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు వాగుల్లో బావులుతవ్వి నీటిని మోటార్లతో పొలాలకు తరలిస్తుండటం విశేషం.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో చాలామంది రైతులు బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేశారు. ఈసారి వర్షాకాలంలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం.. ఎండల తీవ్రతతో భూగర్బ జలాలు అడుగంటాయి. ప్రభుత్వం వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌లో లోఓల్టేజీ సమస్య తలెత్తడంతో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. 3.61 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం దిగుబడి పెద్దఎత్తున తగ్గే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావం, ముదిరిన ఎండలతో బోరుబావులు వట్టిపోవడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో ఎక్కడ చూసినా పంటలకు నీరందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల చేసేదేమీ లేక రైతులు పంటల్ని గొర్రెలు, పశువుల మేతకు వదిలేశారు.
సాగునీరు అందక ఎండుతున్న పంటలు
బోరుబావుల్లో తగ్గుతున్న నీటిమట్టం
వాగులో చెలిమలు తవ్వి
పంటకు నీరందిస్తున్న వైనం
అవస్థలు పడుతున్న అన్నదాతలు
కోయిల్‌సాగర్ ఆయకట్టులో 7 ఎకరాల్లో వరి సాగు చేశా. పొలం సమీపంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌లో నీరు ఖాళీకావడంతో బోరుబావుల్లో నీటిమట్టం అడుగంటింది. ఇక చేసేది లేక రూ.10 వేలు వెచ్చించి పొక్లెయిన్‌తో వాగులో గుంతతవ్వి ఊట నీటిని మోటార్లతో పంటలకు నీరందిస్తున్నా. ఇప్పటికే రెండు ఎకరాలు నీరందక ఎండిపోయింది. మిగతా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా. – చక్రపాణిరెడ్డి, రైతు, రాకొండ


