● జిల్లావ్యాప్తంగా
అంబరాన్నంటిన వేడుకలు
● పేటలో ఆర్యసమాజ్, వీహెచ్‌పీ
ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు
● రాంలీల మైదానాల్లో రావణ దహనం
నారాయణపేట/మక్తల్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలు జిల్లావ్యాప్తంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, ఆయుధపూజతో పండుగ సందడి నెలకొంది. జమ్మి ఆకులను పరస్పరం పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నారాయణపేటలోని బారంబావి ప్రాంతంలో ఆర్యసమాజ్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, నగర ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అనంతరం జమ్మి కొమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాంలీలా మైదానంలో రావణ దహనం నిర్వహించారు.
● జిల్లాకేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో వక్తలు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు, విజయదశమి విశిష్టతను వివరించారు. పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పుష్కలంగా పంటలు పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
మద్దూరులో తూర్పుదిశగా శమీ పూజ..
మద్దూరులో ప్రత్యేక సంప్రదాయం ప్రకారం శమీ పూజ నిర్వహించారు. పండుగ ఏ వారం పండుగ వస్తుందనే దాని ఆధారంగా పంచాంగం ప్రకారం పూజ దిశను నిర్ణయించడం ఇక్కడి ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది మంగళవారం విజయదశమి రావడంతో పోలీస్‌స్టేషన్ సమీపంలోని తూర్పు దిశలో శమీ వృక్షానికి పూజలు చేశారు.
మక్తల్‌లో..
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న రాంలీలా మైదానంలో రావణ దహనం చేశారు. అంతకుముందు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా ఆలయంతో పాటు, నల్లజానమ్మ, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శమీ పూజలో పాల్గొన్నారు. అలాగే మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాంలాల్, ఎస్‌ఐ రాజు ఆయుధ పూజలు చేశారు. పండుగ సందర్భంగా పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి పాతబజారు, నేతాజీనగర్, వాకిటి వీధి, మారుతినగర్, యాదవనగర్, గోపాలస్వామి ఆలయం, పాతటాకీస్, బ్రాహ్మణవాడ, అజాద్‌నగర్ మీదుగా రాంలీలా మైదానం శోభాయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా బ్యాండ్ తెప్పించారు. అనంతరం రాంలీలా మైదానంలో రావణ దహనం వేడుకలో పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.


