నారాయణపేట: ప్రజల రక్షణ, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ డా. వినీత్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అధికారులు, అమరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎండ, వాన, పగలు, రాత్రి తేడాలేకుండా ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. కుటుంబ సభ్యులతో జరుపుకోవాల్సిన పండుగలు, ప్రత్యేక సందర్భాలను సైతం త్యజించి ప్రజల ప్రశాంత జీవనం కోసం అహర్నిశలు శ్రమిస్తారని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధనకు కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 1959, అక్టోబర్ 21న లడఖ్ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే సమాజంలో శాంతి, భద్రతలు నెలకొని అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత విధుల్లో భాగంగా 2005లో కానిస్టేబుల్ రాజారెడ్డి వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీసులు అమరులైనట్లు తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సావర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు, అక్కడి నుంచి తిరిగి పోలీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జోహార్ పోలీసు అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, పరేడ్ కమాండర్ ఆర్‌ఐ విజయభాస్కర్, సీఐలు రాంలాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


