అలంపూర్: అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం మంగళవారం రాత్రి తుంగభద్ర పుష్కరఘాట్‌లో వైభవంగా జరిగింది. హంస వాహనంపై కొలువుదీరిన ఆదిదంపతుల నదీ విహారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్ దీపాల వెలుగులు, బాణసంచా కాంతుల నడుమ సాగిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెప్పోత్సవానికి ముందు బాలబ్రహ్మేశ్వర స్వామివారు మంగళవాయిద్యాల నడుమ పల్లకీ సేవలో జోగుళాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను పుష్కర ఘాట్‌కు తీసుకెళ్లి నదీ పూజలు, నవక పూజలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై దేవతామూర్తులను కొలువుదీర్చి తుంగభద్ర నదిలో విహరింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, ఆలయ ఈఓ దీప్తి, అమ్మవారి దీక్ష స్వీకరించిన స్వాములు పాల్గొన్నారు. తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.


