● పట్టణాలు, పల్లెల్లో మొదలైన పండుగ వాతావరణం
● ప్రత్యేక పూజలకు ఆలయాలు ముస్తాబు
● నేడు అంబరాన్నంటనున్న
విజయదశమి సంబరాలు
● బారంబావి వద్ద శమీ పూజలు..
రావణ దహనానికి ఏర్పాట్లు
● పూలు, పండ్ల కొనుగోళ్లతో
పండుగ సందడి
జిల్లాలోని మద్దూర్‌లో శమీ పూజకు ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. పండుగ ఏ వారంలో వస్తుందో పంచాంగం ప్రకారం ఆ వారానికి నిర్దేశించిన దిశలో జమ్మి కొమ్మను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. మద్దూర్‌లో విజయదశమి పూజా దిశను వారాన్ని బట్టి నిర్ణయిస్తారు. మంగళవారం వస్తే తూర్పు దిశలో పోలీస్‌స్టేషన్ సమీపంలో.. బుధ, గురువారాల్లో పడమర దిశలోని శివాలయం వద్ద.. శని, సోమవారం వస్తే దక్షిణ దిశలోని ఏరియా ఆస్పత్రి సమీపంలో పూజలు నిర్వహిస్తారు. శుక్ర, ఆదివారం వస్తే ఉత్తర దిశలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద జమ్మి కొమ్మను ఏర్పాటు చేసి పూజిస్తారు. ఈ సంప్రదాయం మద్దూర్ దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది. ఈ ఏడాది మంగళవారం విజయదశమి రావడంతో తూర్పు దిశలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో శమీ పూజ నిర్వహించనున్నారు.
విజయదశమి సందర్భంగా శమీ వృక్షానికి పూజ చేయడం, జమ్మి ఆకులను పరస్పరం అందించుకోవడం శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఒకచోట చేరి పూజల్లో పాల్గొని, జమ్మి ఆకులను పంచుకుంటూ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకొంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం పండుగలో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతను చాటిచెబుతోంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే రావణ దహన కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నారు. వివిధ హిందూ సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో రావణాసురుడి ప్రతిమలను ఏర్పాటుచేసి దహనం చేయనున్నారు. విజయదశమి సందేశాన్ని చాటిచెప్పేలా వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నారాయణపేట: ఆధ్యాత్మికతకు అద్దం పట్టే వేడుక.. విజయానికి ప్రతీకగా నిలిచే పర్వదినం.. చెడుపై మంచి సాధించిన గెలుపునకు నిదర్శనం.. అదే విజయదశమి! అమ్మవారి ఆరాధనతో ఆధ్యాత్మిక చైతన్యం.. శమీ పూజలతో శుభాకాంక్షల పరిమళం.. రా వణ దహనంతో విజయ సందేశం.. కుటుంబ స భ్యుల కలయికతో ఆనందోత్సాహం.. ఇలా దసరా పండుగకు జిల్లా ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రుల ముగింపు వేళ ఆలయాలు ప్రత్యేక పూజలకు సిద్ధమవుతుండగా.. పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. పూలు, పండ్లు, కొత్త దుస్తులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో జిల్లా కేంద్రంలోని మార్కెట్లు సందడిగా మారాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
బారంబావి వద్ద శమీ పూజలు..
విజయదశమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బారంబావి వద్ద ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఓంకార జెండాతో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టనున్నారు. పల్లకీ సేవలు, వాహనాల ద్వా రా జమ్మి కొమ్మలను తీసుకొచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రావణ దహనం చేపట్టి, జమ్మి ఆకులను పరస్పరం పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకోనున్నారు.
పాలపిట్ట దర్శనం.. శుభప్రదమనే విశ్వాసం
విజయదశమి రోజున పాలపిట్టను చూడటం శుభ ప్రదమనే విశ్వాసం ప్రజల్లో తరతరాలుగా కొనసాగుతోంది. నీలి వర్ణపు రెక్కలతో ఆకట్టుకునే పాలి పట్ట వ్యవసాయానికి హాని చేసే పలు కీటకాలను ఆహారంగా తీసుకుంటూ, పర్యావరణ సమతుల్యత కు తోడ్పడుతుంది. సంప్రదాయం, ప్రకృతి పరిరక్షణ సందేశాలతో విజయదశమి పండుగ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది.


