నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ చెరువు విస్తరణ, కట్ట ఎత్తు పెంపు ప్రతిపాదనలతో గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని.. వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించి, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్ నియోజకవర్గంలో ఎన్ని చెరువులను నింపి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారనే వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కొడంగల్‌కు సాగునీరు అందించే క్రమంలో మక్తల్ నియోజకవర్గం నీటితో పాటు భూములను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు మక్తల్ – నారాయణపేట ప్రధాన రహదారి దుస్థితిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పనులకు రూ.237 కోట్లతో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రహ్మాన్, తరుణ్, ఆనంద్ రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


