నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతలను పటి ష్టంగా కొనసాగిస్తూ.. మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో తన సతీమణి ప్రీతితో కలిసి ఆయుధ, వాహన పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శక్తి, ధైర్యం, విజయానికి ప్రతీకగా దుర్గామాతను ప్రార్థిస్తూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అత్యవసర సమయాల్లో సత్వర సేవలు అందించడంలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ ఐ విజయభాస్కర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సునీత, శివశంకర్, శిరీష, కృష్ణచైతన్య పాల్గొన్నారు.


