ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

● కాంగ్రెస్‌ పార్టీ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: గ్రాడ్యుయేట్‌ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటరుగా తప్పక నమోదు చేయించాలన్నారు. పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి గెలుపు దీనిపైనే ఆధారపడి ఉందన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరించి వచ్చే నెల 6వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎండబెట్టిన బీఆర్‌ఎస్‌, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఈ మూడేళ్ల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువత నిరాశ, నిస్పృహలకు గురి కావద్దని, త్వరలోనే రాజీవ్‌ యువ వికాస్‌ పథకం అమలు కానుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలి:

చల్లా వంశీచంద్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు సమష్టిగా పనిచేసి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్‌రెడ్డికి ‘గిఫ్ట్‌శ్రీగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 6వ తేదీలోగా అన్ని గ్రామాల్లో ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఉందన్నారు. ఈ మూడేళ్ల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో 80 శాతం మంది ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు.

అందరూ నమోదు చేసుకోవాలి: అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి

పట్టభద్రులందరూ ఓటరుగా తప్పక నమోదు చేయించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సావ రామ్మోహన్‌రెడ్డి కోరారు. ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమని, ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్య, నాయకుడు తామే అభ్యర్థిగా భావించి కష్టపని పనిచేయాలన్నారు. తాను గెలిస్తే శాసనమండలిలో ఆయా సమస్యలను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కటి కావడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయకారీ ఒప్పందం చేసుకుంటాయని ఆరోపించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ. డా.మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, మేఘారెడ్డి, డా.రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్‌, సరిత పాల్గొన్నారు.

ఈ ఎన్నిక దిక్సూచి: మంత్రి వాకిటి శ్రీహరి

ఈ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ సాధారణ ఎన్నికలకు దిక్సూచి లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వచ్చే నెల 6వ తేదీలోగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా తిరిగి ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. గత ఎన్నికలు జరిగినప్పుడు 5.31 లక్షల మంది పట్టభద్రులు ఉండగా.. ఇందులో 55 శాతం ఉమ్మడి పాలమూరులోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించి ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement