నారాయణపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా మహిళ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ ప్రియాంక వేడుకల్లో పాల్గొని బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు సామూహికంగా జరుపుకొనే పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. మహిళల ఐక్యత, ఆత్మీయతకు బతుకమ్మ వేడుకలు అద్దం పడతాయని తెలిపారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడం తెలంగాణ సంప్రదాయ కళాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతిపై గౌరవం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంపొందిస్తుందని చెప్పారు. తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, ఏఓ అనిల్కుమార్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.


