అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● మక్తల్‌లో ముగ్గురి అరెస్ట్‌..

1.4 కిలోల గంజాయి స్వాధీనం

నారాయణపేట: మక్తల్‌లోని రాంలీలా మైదానం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకొని వారి నుంచి 1.4 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన స్కూటీ, మూడు సెల్‌ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డా. జి.వినీత్‌ వెల్లడించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని..నిందితులకు నిర్వహించిన డ్రగ్‌ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితులు మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలు చేసి రాయచూర్‌ మీదుగా మక్తల్‌తో పాటు పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ అక్రమ రవాణా వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఆర్థిక లావాదేవీలు ఎలా సాగుతున్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటక రాయచూర్‌కు చెందిన ఓం అశోక్‌ కొరాడి, మహారాష్ట్రలోని దక్షిణ సోలాపూర్‌కు చెందిన రాజశేఖర్‌ రాంచందర్‌ హూనరావు, సోలాపూర్‌కు చెందిన ఎండీ యాసీన బందెనవాజ్‌ మఖానన్‌దార్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మక్తల్‌ పోలీస్‌స్టేషనన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే సమీప పోలీస్‌స్టేషనన్‌లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో పాల్గొన్న మక్తల్‌ సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ రాజు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ పురుషోత్తం, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement