ఏడాదిలో పేట–మక్తల్‌ రహదారి పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో పేట–మక్తల్‌ రహదారి పూర్తి చేయాలి

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

నారాయణపేట/మక్తల్‌/ఊట్కూరు: మాటలు కోటలు దాటుతున్నా.. మక్తల్‌–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు మాత్రం అడుగు ముందుకుపడటం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం మక్తల్‌ నుంచి నారాయణపేటలోని సింగారం చౌరస్తా వరకు సుమారు 25 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ఆయన సాయంత్రం అక్కడే నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే పాలకులు ప్రజలకు నిత్యావసరమైన రహదారి నిర్మాణాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన పనులు ఇప్పటికీ చేపట్టకపోవడం విచారకరమన్నారు. మూడేళ్లుగా రహదారి పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో నిర్మాణం పూర్తిచేయకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

రూ.237 కోట్లు మంజూరైనా పనులెక్కడ?

మక్తల్‌–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.237 కోట్లు మంజూరైనట్లు చెబుతున్నప్పటికీ పనులు ఎందుకు ముందుకుసాగడం లేదని రామ్మోహనరెడ్డి ప్రశ్నించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రహదారి పనులు ఆలస్యం కావడానికి కారణాలేమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రహదారి పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గ్రామాలు, తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా.. మక్తల్‌–నారాయణపేట రహదారి మాత్రం మూడేళ్లుగా ఎందుకు ముందుకుసాగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు ఆయన దృష్టికి చేరడం లేదా? ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రహదారి నిర్మాణంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సింగారం చౌరస్తాకు చేరుకున్న సందర్భంగా నారాయణపేట మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌, కౌన్సిలర్‌ భరత్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement