నారాయణపేట: త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల వ్యూహం, ఓటరు నమోదు, పార్టీ శ్రేణుల బాధ్యతలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుస్తూ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గరపడే వరకు వేచి చూడకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ నిర్దేశిత లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు వేపూరి రాములు, విజయ్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


