● సెన్సస్–2027లోప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి
● రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొల్లికేరి
నారాయణపేట: జనాభా గణన–2027లో స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, తక్కువ సమయంలో నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొల్లికేరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు జనగణన రెండో దశపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. జనగణనలో కచ్చితత్వం, సమన్వయం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల వివరాలను సంబంధిత యాప్లో ప్రజలే ముందుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్వీయ గణన పూర్తయిన అనంతరం ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాలను సందర్శించి.. నమోదు చేసిన వివరాలను పరిశీలించాలని తెలిపారు. అవసరమైన చోట సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ విధానం ద్వారా ఎన్యూమరేటర్లకు పనిభారం తగ్గడంతో పాటు ప్రజలకు కూడా సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లాలో సుమారు 6.5 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలోగా స్వీయ గణన లక్ష్యాలు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ)లో సేకరించిన వివరాలను ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి పరిశీలించాలని ఆమె సూచించారు. జనాభా పెరుగుదల, కొత్త నిర్మాణాలు, వలసలు, నమోదు కాని నివాసాలు, సంస్థాగత గృహాలు, ఖాళీ ఇళ్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ప్రొఫార్మాల్లో నమోదు చేయాలన్నారు. ప్రతి హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) పరిధిలోని జనాభాను అంచనా వేసి, అవసరమైన చోట మాత్రమే బ్లాక్ల విభజన చేపట్టాలని తెలిపారు. సరిహద్దులను యధాతథంగా ఉంచుతూ.. నిబంధనల ప్రకారం సూపర్వైజరీ సర్కిళ్లను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు. అలాగే పీఈ యాప్లో వివరాలను మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనపు కలెక్టర్ శ్రీను, సీపీఓ రాఘవాహన్ ఉన్నారు.


