మక్తల్ – నారాయణపేట రహదారి విస్తరణకు గ్రహణం
● సీఎం, మంత్రులు రెండుమార్లు శంకుస్థాపన చేసినా మొదలుకాని పనులు
● రూ.237కోట్లతో రోడ్డు విస్తరణపై మీనమేషాలు
● 26 కి.మీ. రహదారిపై నిత్యం ప్రమాదాల ప్రయాణం
నారాయణపేట: జిల్లాలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు శంకుస్థాపన చేసిన రోజు ఎంతో సందడి కనిపించింది. నిధుల ప్రకటనలు హోరెత్తాయి. రోడ్డు విస్తరణపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. మక్తల్ – నారాయణపేట రహదారి ఎప్పుడు బాగవుతుందనే ప్రశ్నలు ప్రజలను వెంటాడుతున్నాయి. సుమారు 26 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 700 గుంతలు ఉన్నా యని చెబుతున్న వాహనదారులు.. వాటిని తప్పించుకుంటూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్ర యాణిస్తున్నారు. రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్లకు సైతం రహదారి దుస్థితి ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
రహదారి నిర్మాణానికి మొదట రూ.200 కోట్లు, అనంతరం రూ.237 కోట్లతో చేపట్టనున్నట్లు ప్రకటించారు. టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో పనులు ప్రారంభించడంలో జాప్యానికి కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండుసార్లు శంకుస్థాపన జరిగినా పనులు ముందుకు సాగకపోవడాన్ని చూస్తే.. అభివృద్ధి ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతోందని ప్రజలు అంటున్నారు.
వాహనదారులకు నిత్య పరీక్ష..
మక్తల్ నుంచి నారాయణపేటకు నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు రహదారి దుస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోందని.. ద్విచక్ర వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో రహదారిపై ప్రయాణమే సమస్యగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు.


