రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

నారాయణపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రహదారులపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ, రవాణా, పోలీసు, మున్సిపల్‌ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వివరాలను ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట రమణయ్య పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. జాతీయ, గ్రామీణ రహదారులపై అవసరమైన చోట స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్‌ సూచికలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. మున్సిపల్‌ పరిధిలో రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నో పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాల నిలుపుదలను నియంత్రించాలని ఆదేశించారు. మెడికల్‌ కాలేజీ ప్రవేశ మార్గాల్లో అడ్డంకులు తొలగించి, అంబులెన్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, ప్రమాద బాధితులకు అందించే చికిత్స, అంబులెన్స్‌ల లభ్యతపై వైద్యాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పీఎం రాహత్‌ పథకం మార్గదర్శకాలపై సంబంధిత అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌ హక్‌, డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా.సంపత్‌ కుమార్‌, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డా.మల్లికార్జున్‌, రవాణాశాఖ అధికారులు రాజేష్‌, మున్నీ, పీఆర్‌ ఈఈ అశోక్‌ కుమార్‌, డీఈఓ గోవిందరాజులు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ యాకన్న తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement