కోస్గి రూరల్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కోస్గి డిపో నుంచి వివిధ రూట్లల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కొత్తపల్లి రాజయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 19వ తేదీ వరకు, తిరిగి 22 నుంచి 24వ తేదీ వరకు కోస్గి – మహబూబ్నగర్, కోస్గి – హైదరాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పూర్తిగా తగ్గింది. శుక్రవారం కేవలం 300 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ తెలిపారు. గురువారం నాటికి నారాయణపూర్ డ్యాం నుంచి రోజువారీగా 5వేల క్యూసెక్కుల నీరు నాలుగు రోజుల పాటు రావడం.. ఆపై 1,000 క్యూసెక్కుల నీరు రెండు రోజులపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిందన్నారు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలతో పాటు ఆర్డీఎస్ లింక్ కెనాల్, సమాంతర కాల్వ, భీమా ఫేజ్–2కు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా జూరాల ఆయకట్టుకు నాలుగు రోజులుగా సాగునీటి విడుదల నిలిచిపోయింది.
ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: దసరా పండుగ సెలవుల్లో సొంతూరు, బంధువుల వద్దకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ డా.వినీత్ శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు ఇంట్లో ఎవరూ ఉండని సందర్భంలో స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని.. లేదా నమ్మకమైన పొరుగు వారికి ఇంటి భద్రతను గమనించాలని చెప్పాలన్నారు. అలాగే ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, భద్రతా అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. తాము ఊరికి వెళ్తున్నట్లు, ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు, కార్లను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేసి, హ్యాండిల్ లాక్ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, నివాస ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసరమైతే డయల్ 112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 70399 నంబర్కు సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


