నారాయణపేట: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగులు వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారి నిరసనకు మద్దతు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఉద్యోగుల రిలే దీక్షలకు డీఎంహెచ్ఓ కార్యాలయం తరఫున డా.సాయిరాం, డా.సత్యప్రకాశ్రెడ్డి, జిల్లా ఆస్పత్రి ఉద్యోగ సంఘం తరఫున డా.బాలాజీ, సత్యనారాయణ మద్దతు తెలిపారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, టీఎన్జీవో చైర్మన్ నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఉదయ్‌భాను, విజయ్‌కుమార్, యూటీఎఫ్ అధ్యక్షులు బాలాజీ, భీమయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి బలరాం నిరసనకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షుడు బిక్షపతి, అధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి రాఘవేందర్, డా.నర్సింహారావు సగరి, శ్రీలత, వెంకటరమణ, అనురాధ, తిరుపతి, కిరీటి, విరోజ, చందన, శ్వేతశ్రీ, పుష్ప, సరస్వతి, డీడీఎం స్నేహలత, డీఏఎం మమత పాల్గొన్నారు.


