కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం సరైంది కాదని.. ప్రజా ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామస్థాయిలో పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గతంలో నమోదు చేసుకున్న వారు సైతం ఎన్రోల్మెంట్ చేసుకునేలా చొరవ చూపాలని తెలిపారు. కాగా, కొడంగల్ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా క్వారీలు, క్రషర్ మిషన్లు కొనసాగుతున్నాయని.. టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాలుష్యం వెదజల్లే ప్రమాదం ఉందన్నారు. రేడియల్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించకుండా దౌర్జాన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు వెంకటనర్సింహులు, నరేందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, సాయిలు, లాలప్ప, కృష్ణయ్య, నీలప్ప, వెంకటేశ్, శ్రీశైలం, రాజు, నర్సింహ ఉన్నారు.


