‘సాక్షి’లో కథనం రావడంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ అప్పటికప్పుడు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను నర్సరీకి పంపించి చక్కదిద్దే పనులు ప్రారంభించారు. గతంలో మట్టినింపిన సంచు లు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని ఓ క్రమపద్ధతిలో అమర్చి ఎండిన నర్సరీని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేశారు. పంచాయతీ కార్మికులతో నర్సరీ పనులు చేయించిన విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో నర్సరీ పనుల కోసం పంచాయతీ కార్మికులను పంపాల్సి వచ్చిందన్నారు. ఆగస్టులోనే వదిలేసిన నర్సరీలో ఈ నెల 7 వరకు పనులు చేసి బిల్లులు తీసుకున్న విషయమై కార్యదర్శిని అడుగగా గతంలో పనిచేసిన కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నెలలో చెల్లించామని ఓసారి.. ఈ నెలలో చెల్లించలేదని మరోసారి పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా గ్రామంలో నాలుగు నెలల కిందట చెరువు పనులు చేసిన ఉపాధి కూలీలకు నేటికి డబ్బులు చెల్లించకపోయినప్పటికీ ఎలాంటి పనులు జరగని నర్సరీకి సంబంధించిన బిల్లులు మాత్రం వెంటనే చెల్లించడం అధికారుల పనితీరుకు నిదర్శనం.


