నీటిఎద్దడి నివారణకు ముందస్తు కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

నీటిఎద్దడి నివారణకు ముందస్తు కార్యాచరణ

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

నారాయణపేట: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గి రానున్న వేసవిలో నీటిఎద్దడి తీవ్రమయ్యే అవకాశాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో విద్యుత్‌, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్‌ భగీరథ, భూగర్భ జల వనరులు, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, సమస్యాత్మక గ్రామాలు, తండాలను గుర్తించి ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబర్‌లోనే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నట్లు సమాచారం అందుతోందని, గతంలో ఏళ్ల తరబడి నీటిని అందించిన బోర్లు సైతం ప్రస్తుతం ఎండిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వేసవి నాటికి సమస్య మరింత తీవ్రమవకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాటి సామర్థ్యం, సరఫరా పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలన్నారు. బోర్ల రీచార్జిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మంజూరైన పనులను వేగవంతం చేసి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాగు, సాగునీటి అవసరాలకు విద్యుత్‌ కీలకమని సరఫరాలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని.. వాహనాల శుభ్రతకు తాగునీటిని వినియోగించడం, కొళాయిలను తెరిచి ఉంచడం వంటి చర్యలను నివారించేలా ప్రచారం చేయాలని సూచించారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా నీటి సంరక్షణపై విస్తృత ప్రచారం చేపట్టాలని డీపీఆర్వో రషీద్‌ను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులకు సూచించారు. రైతువేదికలు, రైతు సదస్సుల ద్వారా నీటిపొదుపు, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని తెలిపారు. వేసవిలో నీటిఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్‌, ఉద్యాన అధికారి సాయిబాబా, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నవీన్‌, నీటిపారుదలశాఖ డీఈఈ సాల్మన్‌, పశుసంవర్ధకశాఖ అధికారి జగదీశ్వరి, హౌసింగ్‌ పీడీ శంకర్‌, మిషనన్‌ భగీరథ డీఈఈ రంగారావు, భూగర్భ జల వనరులశాఖ అధికారి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement