మక్తల్: పేదల పక్షాన పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న అని.. ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని ముస్లాయిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి అ నంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ముది రాజ్‌లతో పాటు బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ధనవంతులు, పెత్తందారులు, భూస్వాముల దోపిడీని ఎదిరించి వారి ఆధిపత్యానికి సవాల్ విసిరిన ఽధైర్యశాలి అన్నారు. ఉన్నవారి సంపదను పేదలు, ఆకలితో అలమటిస్తున్న వారికి పంచి అండగా నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని.. అందుకే ఆయనను ప్రజలు తెలంగాణా రాబిన్‌హుడ్‌గా గుర్తించారన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని.. రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని.. సీఎం రేవంత్‌రెడ్డికి ముదిరాజ్ సామాజికవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ పవిత్ర, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద విజయకుమార్, మెట్టుకాడి ప్రభాకర్, చొప్పరి శంకర్, శివకుమార్, జేఏసీ ప్రధానకార్యదర్శి యాదగిరి ముదిరాజ్, బాబు, నాగరాజు, జానకిరాములు, మాజీ సర్పంచ్ మణివర్ధన్, సురేందర్, సర్పంచ్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.


