నారాయణపేట: భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ, సర్వే పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా సర్వే పురోగతి, పెండింగ్ పనులు, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గుండుమాల్‌లో భూ సేకరణ సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించగా.. నాగిరెడ్డిపల్లి, లక్ష్మీపూర్‌లో కొనసాగుతున్న సర్వేను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. కోస్గి, దామరగిద్ద మండలాల్లో పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మద్దూరులోని మూడు గ్రామాల్లో సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రేడియల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ప్రాధాన్యతనిస్తూ పేరపళ్లలో సర్వే ప్రారంభించాలన్నారు. జనరల్ అవార్డు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలని, మద్దూరు, కోస్గి, కొత్తపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెనన్స్కు అవసరమైన భూమిని గుర్తించి ల్యాండ్ రిపోర్టులు అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రీ–సర్వే అవసరమైన గ్రామాల్లో నిబంధనల ప్రకారం జనరల్ నోటీసులు జారీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ప్రాధాన్యతగా ఎంపిక చేసి రీ–సర్వేకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భూ సేకరణ పురోగతిపై రోజువారీ నివేదికను అదనపు కలెక్టర్ ఏర్పాటు చేసిన గ్రూపులో తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూ సేకరణలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, ఏవో అనిల్‌కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి గోవింద్, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, నారాయణపేట, ఊట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమాల్, కోస్గి తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, అశోక్‌కుమార్, తిరుపతయ్య, మహేష్, భాస్కరస్వామి, కళ్యాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


