మరోమారు ఆందోళనలకు సిద్ధమవుతున్న అన్నదాతలు..
ఆయకట్టుకు సాగునీరు అందించి పంటలను కాపాడాలంటూ రైతులు మరోమారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వరుసగా ఐదురోజుల పాటు కాల్వలకు నీటిని వదిలి నిలిపివేశారు. ఆరురోజులు అవుతున్నా తిరిగి నీటిని ఎందుకు వదలడం లేదని ఆందోళన చేస్తే తప్పా పంటలకు నీరందని పరిస్థితి ఉందని ఆయకట్టు రైతులు తెలిపారు. జలాశయం ఎగువ భాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సైతం సాగునీరు సమృద్ధిగా అందకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జలాశయంలో ప్రస్తుతం 4.747 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో అతి కష్టం మీద ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గత వారం వారాబందీని ప్రకటించిన ప్రభుత్వం 5 రోజుల పాటు నిరంతరం కాల్వలకు నీటిని వదిలి మరో 5 రోజుల పాటు పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమైంది. 5 రోజుల పాటు సాగునీరు పొందిన ఆయకట్టు రైతులు ప్రస్తుతం 6 రోజులవుతున్నా.. నీరు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల రైతులు సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను విన్నవించగా.. కుడి, ఎడమ కాల్వలకు బుధవారం నీటిని వదులుతామని అధికారులు ప్రకటించారు. ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 30 వేల ఎకరాలు సాగులో ఉంది. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయని.. నిరంతరం నీరందిస్తేనే చేతికొస్తాయని అన్నదాతలు అధికారులకు విన్నవిస్తున్నారు.
ప్రధాన ఎడమ కాల్వలో నిలిచిన నీటి ప్రవాహం
జూరాల జలాశయంలో 4.747 టీఎంసీల నీటినిల్వ
గత వారం 5 రోజులు.. ఈ వారం 4 రోజులే నీటి సరఫరా
తడారుతున్న ఆయకట్టు పంటలు
కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.15 లక్షల ఎకరాలు


