అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

నారాయణపేట: సర్‌ పేరిట అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే కుట్రలను సాగనివ్వమని.. ఓటర్ల జాబితాతో చెలగాటమాడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సత్యనారాయణ చౌరస్తాలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైనన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎన్నిక ల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్‌పై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు నోటీసు అందుకున్న ప్రతి ఓటరుకు తన వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం పారదర్శకత పాటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో పౌరుడి గొంతుకని.. దశాబ్దాలుగా ఓటు వేస్తున్న వారిని పాత రికార్డులు, పూర్వీకుల వివరాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలిపారు. పేరు తొలగించే ముందు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఫారం–6, 7 ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం సత్యనారాయణ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ నాయకుడు నర్సింహ, సీపీఐ(ఎం) నాయకుడు వెంకట్రామారెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు హన్మేష్‌చారి, బి.రాము, కాశీనాథ్‌ మాట్లాడుతూ.. సర్‌ పేరిట అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధానకార్యదర్శి మహ్మద్‌ సలీం, మార్కెట్‌ మాజీ చైర్మన్లు ఆర్‌.శివారెడ్డి, బండి వేణుగోపాల్‌, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు కాంతకుమార్‌, ఇండియా కూటమి నాయకులు గోపాల్‌, బాల్‌రాం, మహ్మద్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement