నారాయణపేట: క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనే విజయానికి బాటలు వేస్తాయని ఇన్చార్జి డీవైఎస్ఓ వెంకటేష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో మూడురోజులుగా కొనసాగుతున్న 70వ ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. చివరిరోజు కబడ్డీ పోటీలను ఆయనతో పాటు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీ విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టు తరఫున ఉమ్మడి పాలమూరు పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గొడుగు నర్సింహులు, రత్నయ్య, వెంకటప్ప, సాయినాథ్, బాలరాజు, నర్సింహారెడ్డి, కతలప్ప, అనంతసేన, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్వరి, వెంకటేష్, సౌమ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


