మరికల్: కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు కష్టకాలంలో సాగునీరు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిన్నచింతకుంట మండలం ఉంద్యాల పంపుహౌస్, మండలంలోని తీలేర్ పంపుహౌస్ వద్ద కోయిల్‌సాగర్‌కు పంపింగ్ అవుతున్న మోటార్లను పరిశీలించి నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలమూరు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం సానుకులంగా స్పందించి నీటిని విడుదల చేసిందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి కర్వెన వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేంది కాదన్నారు. పాలమూరు రైతులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది, పెండింగ్ ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు.
కోయిల్‌సాగర్‌కు
నీటిపంపింగ్ ప్రారంభం
మరికల్: కర్ణాటక ప్రభుత్వంతో కుదిరిన ఒప్ప దంప్రకారం నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు కృష్ణా జలాలు వదలడంతో శుక్రవారం కోయిల్‌సాగర్‌కు నీటిపంపింగ్‌ను అధికారులు ప్రారంభించారు. రెండ్రోజుల కిందట ఉంద్యాల స్టేజీ–1 దగ్గర రెండు పంపుల ద్వారా పర్ధీపూర్ రిజర్వాయర్‌కు నీటిపంపింగ్ చేయడంతో తీలేర్ స్టేజీ–2 దగ్గర ఒక మోటారుతో 315 క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్‌కు తరలిస్తున్నారు.నారాయణపూర్ నుంచి జూరాలకు నీటి సరఫరా కొనసాగే వరకు కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ కొనసాగుతుందని అధికారులు వివరించారు. ప్రస్తు తం కోయిల్‌సాగర్‌లో 20 అడుగుల నీటిమట్టం ఉంది.
కేఎస్పీ కుడి కాల్వకు నీటి విడుదల..
కోయిల్‌సాగర్ ఆయకట్టులోని వరి వాడుముఖం పట్టడంతో రైతుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ప్రాజెక్టు అధికారులతో పాటు డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్‌రెడ్డి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారం పాటు నీటి విడుదల కొనసాగుతుందని, రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎడమ కాల్వకు కూడా నీటి విడుదల చేయడంతో కుడి, ఎడమ కాల్వల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి, జయసింహారెడ్డి, నరహరి, హరీశ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.


