● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ.3 కోట్లతో అదనంగా ఏర్పాటుచేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు పడిందన్నారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. మక్తల్, ఆత్మకూర్, నర్వ, మాగనూర్, అమరచింత మండలాల్లో రహదారులు, వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతుల సాగునీటి కష్టాలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. జూరాల ఆయకట్టులో సాగు చేసిన పంటలు ఎండిపోకుండా కాల్వలకు నీటిని వదిలినట్లు చెప్పారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ నవీన్‌కుమార్, విజయ్‌కుమార్, ఏఈ వెంకటేష్‌గౌడ్, కాంట్రాక్టర్ కృష్ణ, కౌన్సిలర్ రహీం పటేల్, పీకే నర్సింహ, వెంకటేశ్వర్లు, అమరేందర్‌రెడ్డి, హన్మంతు, శ్రీనివాస్‌గౌడ్, కట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు.


