నారాయణపేట: గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపడుతోందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా 25 మంది రౌడీషీటర్లు, 77 మంది కమ్యూనల్ షీటర్లు, మరో 54 మంది వ్యక్తులను బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో సుమారు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కల్పిస్తామని చెప్పారు. అదనపు ఎస్పీ–1, డీఎస్పీలు–2, సీఐలు–16, ఎస్సైలు–31, ఏఎస్సై/హెచ్‌సీలు–156, పోలీస్ కానిస్టేబుల్స్– 347, హోంగార్డులు–116, టీజీపీఎస్ ప్లటూన్లు–3 బలగాలు విధులు నిర్వర్తిస్తాయని వివరించారు. నారాయణపేట, ఉట్కూర్, మక్తల్, కోస్గి పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం, తాఖీబాబా దర్గా ఉర్సు కార్యక్రమాలు ఒకే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులు చేయవద్దని సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి ధరకు
నాణ్యతే కీలకం
నారాయణపేట: పత్తి సీజన్ ప్రారంభం కావడంతో ధరలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు పరిధిలోని విజయ కాటన్ ఇండస్ట్రీస్‌ను మార్కెట్ కార్యదర్శి భారతితో పాటు అధికారులు సందర్శించి, పత్తి నాణ్యతను పరిశీలించారు. పత్తిలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడంతో పాటు రైతులతో నేరుగా మాట్లాడి మార్కెట్‌లో లభిస్తున్న ధరల వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో పత్తి క్వింటాకు రూ.8,000 నుంచి రూ.9,250 వరకు ధర పలుకుతున్నట్లు మిల్లు యాజమాని కిషోర్‌కుమార్ అధికారులకు తెలిపారు. పత్తిలో 8 నుంచి 10 శాతం వరకు తేమ ఉన్నట్లు గుర్తించారు. పత్తి నాణ్యత, తేమ శాతం, దిగుబడి లక్షణాల మేరకు కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


