కృష్ణా: నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. మండలకేంద్రంలో సోమవారం జరిగిన ఎస్‌జీఎఫ్ క్రీడలకు వచ్చిన విద్యార్థులకు మత్తు పదార్థాలు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న గుడెబల్లూర్‌కు చెందిన ఐదుగురు యువకులను పోలీసులుఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నవీద్‌ను వివరణ కోరగా.. అనుమానంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారు తీసుకెళ్లిన పదార్థాలు డ్రగ్సేనా? కాదా? అనేది పరీక్షల అనంతరం తేలుతుందని తెలిపారు. అయితే గుడెబల్లూర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన విక్రయదారుడిగా అనుమానిస్తున్నట్లు, అతడి నుంచి ఇతరులు పదార్థాలు తీసుకుని యువతకు విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.
సరఫరా ఎక్కడి నుంచి?
గుడెబల్లూర్‌లో మత్తు పదార్థాల విక్రయానికి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో వాటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి సరఫరా మూలాలను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేవలం అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో కాకుండా, సరఫరా చేసే వ్యక్తుల నుంచి ప్రధాన నెట్‌వర్క్ వరకు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలో గతంలో పేకాట, మట్కా, గుప్త నిధుల వ్యవహారాలు, నిషేధిత ఉత్ప్రేరకాలు, ఇసుక, మట్టి, బూడిద అక్రమ రవాణా, బ్లాస్టింగ్ తదితర అంశాలు తెరపైకి వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తాజాగా డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విద్యార్థులకు విక్రయించేందుకు వెళ్లిన ఐదుగురు యువకుల అదుపులోకి..


