నారాయణపేట: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతికి ఎస్పీ డా. వినీత్ దంపతులు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట:స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన 149 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనెస్తేషియా, బ్లడ్‌బ్యాంక్, సీటీ, ఈసీజీ, ఓటీ, రేడియోగ్రాఫిక్, ల్యాబ్ తదితర టెక్నీషియన్ పోస్టులతో పాటు డేటాఎంట్రీ ఆపరేటర్లు 46, ల్యాబ్ అటెండెంట్లు 20, ఆఫీస్ సబార్డినేట్లు 20, ఇతర కేటగిరీల్లో బార్బర్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కుక్, దోబీ, కిచెన్‌బాయ్, సెక్యూరిటీ గార్డు, వార్డ్‌బాయ్ తదితర పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు స్వీయ ధ్రువీకరణ పత్రాలతో పాటు సర్టిఫైడ్ కాపీలను జతచేసి ఈ నెల 30 వరకు దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు gmcnarayanapet.org వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
నర్వ: రైతులు తమ పంటల్లో అసాధారణ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని టీఆర్‌వీకే శాస్త్రవేత్తలను సంప్రదించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఈటెల సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలో ఆయన పర్యటించి వరి, పత్తి పంటలను పరిశీలించారు. పత్తిలో పారా విల్ట్, వరి పంటలో అంచులు ఎండిపోవడాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించారు. మొక్కలు అకస్మాత్తుగా వాడిపోవడానికి గల కారణాలను పరిశీలించారు. ఆకుల అంచులు ఎండిపోవడం వంటి లక్షణాలను గుర్తించి తగిన సూచనలు అందించారు. పంటలు ప్రస్తుతం చురుకై న పిలకల దశలో ఉన్నాయని.. ఎరువుల వినియోగం, సమతుల్య పోషక యాజమాన్యం, తెగుళ్ల నివారణకు పలు సూచనలు చేశారు. నాబార్డు సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వరి విత్తనాన్ని అందుబాటులోకి తీసుకరావడంతో పాటు స్థానికంగా విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు టీఆర్‌వీకే కృషి చేస్తోందన్నారు.


