ఊట్కూర్: విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక చెక్‌పోస్ట్ దగ్గర రైతులు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ సరఫరాలో కోతలు విధిస్తుండటంతో వరి పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రస్తుతం 8 గంటల విద్యుత్ విడతల వారీగా సరఫరా చేస్తుండటంతో బోరుబావులపై ఆధారపడ్డ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయని వివరించారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో మక్తల్–నారాయణ రోడ్‌పై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ ఏఈ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు భరత్, కోరం శివరాజురెడ్డి, తిమ్మప్ప, షమీ ఉల్లా, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.


