బీఆర్‌ఎస్ దూకుడు మంత్రంతో..
● పాలమూరులో జోరుగా పాలి‘ట్రిక్స్’
● సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
● వెయ్యి రోజుల పాలనపై పార్టీల
పోటాపోటీ కార్యక్రమాలు
● చేసిన అభివృద్ధి, సంక్షేమంపై
కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్లు
● పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
● దగా పాలన అంటూ రోడ్డెక్కిన
బీఆర్‌ఎస్ నేతలు
● ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మద్దూరు పర్యటన
వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎపి సోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 20 23 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్‌పే ట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్‌గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆయనపై చ ర్యలకు సంబంధించి విభిన్న వాదనలు నడుస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
కలవని చేతులతో..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీని వాస్‌రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సీఎం మద్దూరు పర్యటనపై ఆసక్తి..
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్‌ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.


