–8లో u
నారాయణపేట: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీ కాలం పొడిగింపు కోసం పైరవీ.. కొత్త పదవుల కోసం లాబీయింగ్.. ఇప్పు డు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నారాయణపేట మార్కెట్ పాలకవర్గం పదవీకాలం ముగియడానికి కేవలం 16 రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి రాజుకుంది. ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తుందా..? లేక కొత్త పాలకవర్గాలకు అవకాశం కల్పిస్తుందా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పదవీకాలం పొడిగింపుపై ఆశలు పెట్టుకున్న పాత సభ్యులు తమ రాజకీయ ప్రయత్నాలను వేగవంతం చేస్తుండగా.. కొత్త కమిటీలు వస్తే పదవులు దక్కించుకోవాలని ఆశావహులు అప్పుడే లాబీయింగ్‌కు తెర లేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
శివన్న బర్త్‌డే కానుకగా పదవి..
నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అప్పట్లో రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి మేనమామ, డీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి జన్మదినం సందర్భంగా 2024, సెప్టెంబర్ 16న మార్కెట్ కమిటీ చైర్మనన్‌గా ఆర్.శివారెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే పాలకవర్గం పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో సభ్యుల్లో టెన్షన్‌న్ మొదలైంది. పుట్టినరోజు కానుకగా వచ్చిన పదవి.. గడువు ముగిసే వేళ రాజకీయ పరీక్షగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మక్తల్ గడువు.. డిసెంబర్ వరకు...
మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా అయిన మక్తల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం మాత్రం డిసెంబర్ వరకు కొనసాగనుంది. దీంతో నారాయణపేట, కోస్గి మార్కెట్ కమిటీల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మక్తల్ మార్కెట్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మూడు మార్కెట్ కమిటీలకు వేర్వేరు గడువులు ఉండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
కోస్గి గడువు వచ్చే నెల 3 వరకు..
జిల్లాలోని కోస్గి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం కూడా అక్టోబర్ 3తో ముగియనుంది. దీంతో అక్కడ కూడా పదవుల పొడగింపుపై ఆశలు కొనసాగుతున్నాయి. మార్కెట్ చైర్మన్ మద్ది భీములుతో పాటు పాలకవర్గ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పదవీకాలం పొడగింపు, భవిష్యత్‌పై వినతులు సమర్పించినట్లు సమాచారం. ఇంకా సమయం ఉందని.. తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీల విషయంలో ఒకేసారి నిర్ణయం తీసుకుంటుందా..? లేక ఒక్కో కమిటీ పరిస్థితిని బట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
సమీపిస్తున్న మార్కెట్ పాలకవర్గాల పదవీ కాలం
పేటకు 16 రోజులు..
కోస్గికి అక్టోబర్ 3 వరకు గడువు
మంత్రి ఇలాకా మక్తల్‌కు
డిసెంబర్ వరకు..
ఎమ్మెల్యేల చుట్టూ
ఆశావహుల ప్రదక్షిణలు
పదవి నిలుపుకొనేందుకు
పాత సభ్యుల పైరవీలు


