ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం

Sep 1 2026 1:31 AM | Updated on Sep 1 2026 1:31 AM

కోస్గి రూరల్‌: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ.. దోపిడీ ఎక్కువ జరుగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సమరశంఖం పూరించిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పుర కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. రేడియల్‌ రోడ్లు, సాగునీటి కాల్వలు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.వందల కోట్ల గోల్‌మాల్‌ జరిగిందన్నారు. రేడియల్‌ రోడ్ల నిర్మాణంలో కాంగ్రెస్‌ నాయకుల భూములుంటే పక్కకు తప్పిస్తున్నారని, పేదల భూములు మాత్రం నిర్ధాక్షిణ్యంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. గుట్టల తవ్వకాలు, ఇసుక, ఎర్రమట్టి తరలింపులో రెవెన్యూ, పోలీస్‌ అధికారులను ఉంచి దోపిడీ చేస్తున్నారని.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.100 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించి నీటివసతి పెంచితే కాంగ్రెస్‌ నాయకులు చెక్‌డ్యాంలోని ఇసుకను విక్రయించి ప్రభుత్వ ఆదాయనికి గండికొడుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇసుకపై రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లుకు చేర్చిందని, అందుకు ప్రజాప్రతినిధులే కారణమన్నారు. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు పుర, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. 2న కొడంగల్‌, 3న కోస్గిలో రైతు సమస్యలు, భూ నష్ట పరిహారంపై రైతులతో చేపట్టే ధర్నాకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరుకానున్నారని చెప్పారు. 4న మద్దూర్‌లో మహిళా సమస్యలు, వంటావార్పు, 5న దౌల్తాబాద్‌ మండలంలో విద్యార్థుల సమస్యలపై నిరసన, 6న బొంరాస్‌పేటలో పచ్చదనం, పల్లెల కార్యక్రమం, 7న అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణిలో ఫిర్యాదులు, 8న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఇన్‌చార్జి వెంకటనర్సింహులు, సాయిలు, శ్యాసం రామకృష్ణ, పోషప్ప, మహిపాల్‌, పకీరప్ప, ఆశప్ప, గోపాల్‌, దినేష్‌, చికినె అంజయ్య, నర్సింహులు, మధుసూదన్‌రెడ్డి, తిరుపతి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement