నారాయణపేట: వెనుకబడిన విముక్త జాతుల సమగ్ర అభ్యున్నతికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సూచించారు. విముక్త జాతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విముక్త జాతులకు చెందిన కుటుంబాలను గ్రామస్థాయిలో గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి వారి సమస్యలు, అవసరాలను గుర్తించాలని, ఇందుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు, రేషనన్ కార్డులు, గృహ వసతి తదితర ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు అర్హత ఉన్న వారికి ఇతర సంక్షేమ పథకాలను అందించాలని అధికారులకు సూచించారు. విముక్త జాతుల కుటుంబాలకు విద్య, వైద్యం వంటి మౌలిక రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి భీమేష్, నాయకులు ఎనుముల వెంకటేష్, మందుల శేఖర్, మద్దూరు భీములు, చంద్రశేఖర్, లోకుర్తి రాజు, జిల్లాకు చెందిన వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


