అర్హుల ఓట్లు గల్లంతు కానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు గల్లంతు కానివ్వొద్దు

Aug 31 2026 1:26 AM | Updated on Aug 31 2026 1:26 AM

నారాయణపేట: ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీవీఆర్‌ భవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ రెండో దశకు శ్రీకారం చుట్టిందని.. ఈ నేపథ్యంలో బీఎల్వోల ద్వారా నోటీసులు అందుకున్న ఓటర్లు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. నోటీసులు అందిన వారు తప్పనిసరిగా సంబంధిత వివరాలను పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలు, పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోగా బీఎల్వోలకు అందజేయాలని కోరారు. ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పేట నియోజకవర్గంలో 72,861 మంది ఓటర్లకు, మక్తల్‌లో 73,815 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి నోటీసులు అందినట్లు తెలిపారు. వీరంతా ప్రత్యేక ఫారాల ద్వారా తమ వివరాలను నమోదు చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు కాంగ్రెస్‌పార్టీకి చెందిన బీఎల్‌ఏలు పూర్తి సహకారం అందించాలన్నారు. అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని నాలుగు వారాల అదనపు గడువు కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం గడువును పొడిగించాలని కోరారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండి వేణుగోపాల్‌, డీసీసీ కోశాధికారి మనోహర్‌ ప్రసాద్‌ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌, డీసీసీ కార్యదర్శి వెంకట్రాములు చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement