ఎఫ్‌ఎల్‌ఎన్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు

Aug 30 2026 1:27 AM | Updated on Aug 30 2026 1:27 AM

నారాయణపేట: నాణ్యమైన బోధన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నిరంతర ఉపాధ్యాయ మద్దతు, లక్ష్యాధారిత అభ్యసనం అనే నాలుగు సూత్రాలతో జిల్లాను ఎఫ్‌ఎల్‌ఎన్‌లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు సమక్షంలో మండల విద్యాధికారులు, పాఠశాల కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో జిల్లాస్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం కార్యక్రమాలను నాణ్యమైన రీతిలో అమలు చేసినప్పుడే విద్యార్థుల విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంపొందించగలమన్నారు. పాఠశాలల పర్యవేక్షణ కేవలం గణాంకాలు, సందర్శనల సంఖ్యకే పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచే విధంగా జరగాలని స్పష్టం చేశారు. బోధన, అభ్యసన పరంగా వెనుకబడిన పాఠశాలలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ పిరియడ్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతి సందర్శనలో తరగతి గది పరిశీలన, విద్యార్థుల అభ్యసన స్థాయి అంచనా, ఉపాధ్యాయులతో అకాడమిక్‌ చర్చలు, అవసరమైన తక్షణ మార్గదర్శకత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలల విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ఉపాధ్యాయుల సాధారణ సెలవులను ముందస్తు అనుమతితోనే మంజూరు చేయాలన్నారు. ఒకే సమయంలో 10 నుంచి 15 శాతానికి మించి సిబ్బంది సెలవుల్లో ఉండకుండా ప్రధానోపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలుగు, ఆంగ్లం భాషల్లో టైమ్‌డ్‌ రీడింగ్‌ ప్రాక్టీస్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. గణితంలో మూడేళ్లుగా అభ్యసన సాధన స్థాయి మెరుగుపడుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బోధనా ప్రక్రియలో టీచర్‌ హ్యాండ్‌బుక్స్‌, స్టూడెంట్‌ వర్క్‌బుక్స్‌, అలైన్‌మెంట్‌ షీట్స్‌ను తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో రోజుకు కనీసం 30 నిమిషాల లైబ్రేరీ పీరియడ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల రచనా సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి భాషా నైపుణ్యాలను మెరుగుపర్చాలన్నారు. ఎంఈఓ, జీహెచ్‌ఎం, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సమన్వయంతో పనిచేసి ప్రతి చిన్నారిలో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన సామర్థ్యాలను సాధించేలా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement