నారాయణపేట: పట్టణంలోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో శనివారం ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. మహా నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం నిర్వహించిన భజన సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్మీ శోభన భజన బృందం భక్తిగీతాలు ఆలపించారు. ఉత్సవాల్లో భాగంగా పల్లకీసే నిర్వహించారు. పూలతో అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. సత్యనారాయణ కమాన్ సమీపంలో లయన్స్‌క్లబ్, రాఘవేంద్ర సేవాసమితి సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సిహాచారి, అనిల్ దేశాయ్, హరీశ్ ఆచార్య, రఘుప్రసాద్ జోషి, రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు, లయన్‌న్స్‌క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


