● రాఖీ కట్టడం సంప్రదాయం.. రక్షణగా నిలబడటం బాధ్యత
● ‘సాక్షి’తో ఎస్పీ డా. వినీత్
నారాయణపేట: రాఖీ పౌర్ణమి అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకునే పండుగ.. కాలంతో పాటు ఈ పండుగ అర్థం కూడా విస్తరిస్తోంది. రక్షణ అంటే కేవలం సోదరుడు సోదరిని కాపాడటం కాదు.. ప్రతి మనిషి మరో మనిషి గౌరవం, భద్రత, హక్కులను కాపాడేందుకు ముందుకు రావడమని ఎస్పీ డా. వినీత్ వివరించారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి నేపథ్యంలో గురువారం ఎస్పీ డా. వినీత్ పండుగ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. రాఖీ అనేది ఒక కుటుంబ వేడుకకే పరిమితమైన అంశం కాదు.. సమాజంలో పరస్పర నమ్మకం, గౌరవం, బాధ్యతను బలోపేతం చేసే విలువల పండుగ. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మా ఇంటా సంబరాలు జరుపుకొనేవాళ్లం. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ప్రస్తుతం ఫోన్‌లో పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయ బంధాన్ని పంచుకుంటున్నాం. రాఖీని చేతికి కట్టినప్పుడు అది కొన్ని నిమిషాల్లో జరిగిపోయే చిన్న కార్యక్రమంలా కనిపిస్తుంది... కానీ ఆ దారం వెనుక నీకు నేను అండగా ఉంటా అనే నమ్మకంతో బంధాలను బలపరుస్తూ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒకరికి ఒకరు తోడుగా నిలిచే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే రాఖీని కేవలం అలంకారంగా కాకుండా బాధ్యతకు గుర్తుగా చూడాల్సిన అవసరం ఉంది.
ఆధిపత్యం కాదు.. గౌరవం
రాఖీ అంటే కొన్నిసార్లు మహిళలను రక్షించాల్సిన బాధ్యత పురుషులదనే కోణంలో చూస్తుంటాం. సమాజం మారుతున్న నేపథ్యంలో రక్షణ భావనను మరింత విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంది. రక్షణ పేరుతో ఆధిపత్యం కాదు.. స్వేచ్ఛను గౌరవించడం. రక్షణ పేరుతో ఆంక్షలు కాదు.. హక్కులకు విలువ ఇవ్వడం. రక్షణ పేరుతో మాటలు కాదు.. అవసరమైనప్పుడు అండగా నిలవడం. ఇదే రాఖీ స్ఫూర్తికి అసలైన అర్థం.
ఇంట్లో మొదలై.. సమాజం వరకు...
రాఖీ పండుగలో కనిపించే ప్రేమ, ఆప్యాయత ఇంటి గడప దాటాలి. కుటుంబంలో సోదరుడు–సోదరి మధ్య ఉన్న గౌరవం.. సమాజంలోని ప్రతి మహిళ పట్ల ఉండాలి. ఒక కుటుంబంలో పిల్లలకు నేర్పే విలువలు.. భవిష్యత్ సమాజాన్ని నిర్మిస్తాయి. ఆడపిల్ల, ఆమె నిర్ణయాన్ని గౌరవించడం.. భద్రతకు అండగా నిలవడం.. హక్కులను గుర్తించడం చిన్న విషయాలుగా కనిపించినా.. సమాజ మార్పుకు అవే పునాదులు.
ఎస్పీ
డా. వినీత్
రాఖీ పౌర్ణమికి పుట్టిన రాఖీ
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కెంచి కిష్టయ్య, ఈరమ్మ దంపతుల కుమార్తె రాఖీ 1973, ఆగస్టు 14న రాఖీ పౌర్ణమి రోజున జన్మించింది. ఆయనకు రాఖీ రెండో కుమార్తె. ఆమెకు సోదరుడు కెంచి శశిధర్ ఉన్నారు. రాఖీ పౌర్ణమి రోజున జన్మించడంతో ఆమెకు ‘రాఖీ’ అని నామకరణం చేశారు. రాఖీ ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ షాద్‌నగర్‌లో ఉంటోంది. అయినప్పటికీ ఏటా తన తమ్ముడు కెంచి శశిధర్‌కు రాఖీ కట్టేందుకు ఆమె పేటకు వస్తారు. సోదరుడి చేతికి రాఖీ కట్టిన అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె జన్మదిన వేడుకలు కూడా జరుపుకొంటారు.
తమ్ముడి శశిధర్‌కు రాఖి కడుతున్న అక్క రాఖీ (ఫైల్)
యువతే మార్పునకు చోదకశక్తి..
నేటి యువత రాఖీ స్ఫూర్తిని కొత్త కోణంలో అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన సమయంలో మాట, ఫొటో, వీడియో, సందేశం ద్వారా కూడా ఇతరుల గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే డిజిటల్ ప్రపంచంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం.. ఎదుటివారి గోప్యతను గౌరవించడం.. అవమానకరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండటం కూడా ఆధునిక రక్షాబంధన్‌లో భాగమే.


