గతేడాది ఆగస్టులో జిల్లాలోని చెరువులు నీటితో కళకళలాడాయి. 373 చెరువులు సర్‌ప్లస్ స్థాయికి, 228 చెరువులు 75–100 శాతం, 118 చెరువులు 50–75 శాతం వరకు నిండాయి. ఈసారి మాత్రం అదే చెరువులు చుక్కనీటి కోసం ఎదురుచూస్తున్నాయి. 75–100 శాతం స్థాయికి చేరిన చెరువులు అతి కొద్దిగా ఉండగా.. సర్‌ప్లస్ స్థాయికి చేరిన చెరువులు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పంట చేతికి రావాలంటే వాన పడాలి.. చెరువు నిండాలంటే వరద రావాలి.. భూగర్భ జలాలు పెరగాలంటే జలాశయాలు నిండాలి. కానీ ఈసారి మూడు దశల్లోనూ ప్రకృతి పరీక్ష పెడుతోంది. గతేడాది ఇదే సమయంలో మత్తడి దుంకిన చెరువులు.. ఈసారి చుక్కనీటి కోసం ఎదురుచూస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే చెరువుల నీటిమట్టాలు పెరిగి భూగర్భ జలాలకు ఊతం లభించే అవకాశం ఉంది.
నారాయణపేట: చెరువులు నిండితే పల్లె పులకించేది.. మత్తడి దుంకితే రైతన్న పంట పండేది.. అలుగు పారితే సాగుకు భరోసా వచ్చేది.. కానీ ఈ ఏడాది వర్షాకాలంలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా 87 రోజుల కాలంలో కేవలం 26 రోజులే వర్షం కురవడం.. సాధారణ వర్షపాతంలో 20 శాతం లోటు నమోదు కావడం.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 53 శాతం తక్కువ వర్షపాతం ఉండటం జిల్లాలో నెలకొన్న వర్షాభావ తీవ్రతను కళ్లకు కడుతోంది.
చినుకు పడినా.. చెరువుకు చేరని నీరు
జూన్ 1 నుంచి ఆగస్టు 24 వరకు జిల్లాలో సాధారణంగా 326.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 262.2 మి.మీ. మాత్రమే నమోదైంది. వర్షం కురిసిన రోజులు తక్కువగా ఉండటంతో ఆ నీరు కూడా చెరువులు, కుంటల్లోకి భారీగా చేరలేదు. ఫలితంగా మత్తడులు మూగబోయాయి.. అలుగులు ఎండిపోయాయి.. చెరువులు వెలవెలబోయాయి.
ధన్వాడలో దారుణం..
మండలాల వారీగా చూస్తే ధన్వాడలో 35 శాతం లోటు వర్షపాతం నమోదై జిల్లాలోనే అత్యధిక వర్షాభావం కనిపిస్తోంది. నారాయణపేట, నర్వలో 33 శాతం, ఊట్కూర్‌లో 29 శాతం, మరికల్‌లో 28 శాతం, దామరగిద్దలో 27 శాతం, మాగనూర్, మక్తల్‌లో 26 శాతం చొప్పున వర్షపాతం లోటు నమోదైంది. అయితే మద్దూర్‌లో సాధారణం కంటే 12 శాతం, కోస్గిలో 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
87 రోజుల్లో.. వర్షం కురిసింది 26 రోజులే
జిల్లాలో 20 శాతం లోటు వర్షపాతం
గతేడాదితో పోలిస్తే 53 శాతం తక్కువ
ఆందోళనలో అన్నదాతలు


