మక్తల్: సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన గ్రామాల వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామాన్ని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే ఊళ్లోకి ఊట వస్తుందని, గ్రామంలో విషపు పురుగుల సంచారం అధికమైందని వివరించారు. గ్రామస్తుల సమస్యలను నమోదు చేసుకొని పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన ఎస్‌ఈ శ్రీధర్, ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, తహసీల్దార్ సతీష్‌కుమార్, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుర్మయ్యగౌడ్, మాజీ సర్పంచ్ హన్మంతు, చెన్నయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
నేరెడుగాం గ్రామంలో..
మాగనూర్: మండలంలోని నేరెడుగాం గ్రామాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సందర్శించారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్నట్లు గ్రామస్తుల విన్నపంతో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గురువారం సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని పురాతన ఇళ్లతో పాటు పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో విషపు పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని.. అనేకమంది పాముకాటుతో మృతిచెందిన ఘటనలు గ్రామంలో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఊటనీటితో పలు ఇళ్లు కూలిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌కు తరలించాలని కోరారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన క్రీడాకారులు
నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ తెలిపారు. సౌత్‌జోన్ అండర్–16 విభాగం 600 మీటర్ల పరుగుపందెంలో పూజ బంగారు, అండర్–18 విభాగం జావెలిన్ త్రోలో రాధిక కాంస్యం, అండర్–18 హైజంప్‌లో అజీమ్ రజత పథకం సాధించినట్లు వివరించారు.
తగ్గిన విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. గురువారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 93.898 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 78.750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 172.648 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 3,510 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు.


