● బీజేపీ జిల్లా అధ్యక్షుడు,
ఏబీవీపీ నాయకుడి మధ్య వాగ్వాదం
● పరస్పరం ఫిర్యాదులు..
విచారణ అనంతరం చర్యలు: ఎస్‌ఐ
నారాయణపేట: మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సత్యయాదవ్, ఏబీవీపీ నాయకుడు చరణ్‌రెడ్డి మధ్య గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చరణ్‌రెడ్డి తన వార్డులో రోడ్ల సమస్యలు, గుంతలు తదితర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ శంకర్‌ను కలిసినట్లు తెలిసింది. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పినప్పటికీ.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. విధులకు ఆటంకం కలుగుతోందని కమిషనర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కమిషనర్ ఫోన్ చేసి చైర్‌పర్సన్ భర్త సత్యయాదవ్‌కు తెలిపారు. దీంతో ఆయన చరణ్‌రెడ్డికి ఫోన్ చేసి సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగినట్లు సమాచారం. అనంతరం సత్యయాదవ్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా మున్సిపల్‌కమిషనర్ చాంబర్‌లో ఇద్దరి నాయకుల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చాంబర్ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఇరువురి తోపులాట జరిగిందని, దీంతో ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చివరికి అక్కడున్న వారు ఇరువురిని సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇరువర్గాల ఫిర్యాదులు
ఘటనపై చరణ్‌రెడ్డి, సత్యయాదవ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విధులకు ఆటంకం కలిగించారంటూ మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరో వ్యక్తి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు అందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కమిషనర్‌ను ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని చరణ్‌రెడ్డి ఆరోపించారు. అయితే సమస్యపై మాట్లాడే విషయంలో భాష సరిగా లేకపోవడంతో వాగ్వాదం జరిగిందని సత్యయాదవ్ తెలిపారు. తనపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించడంతో అనుచరులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు.


