నారాయణపేట ఎడ్యుకేషన్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నర్సింహారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం, పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల పాటువేచి చూశామని.. ప్రభుత్వం నెలలోపు పీఆర్సీ అమలు చేస్తామని ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. మూడు నెలలుగా ఉద్యోగులు తమ వేతనం నుంచి ఆరోగ్య పథకానికి కావాల్సిన చందాను చెల్లిస్తున్నప్పటికీ ఆరోగ్య పథకం అమలు కావడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య సభ్యులు జనార్దన్‌రెడ్డి, శివరాములు, దేవేంద్రప్ప, హైమావతి, వెంకటస్వామి, సూర్యచంద్ర, యశ్వంత్, జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


