కోస్గి రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీఓ రమేష్, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే రోగులకు నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలన్నారు. మోడ్రన్ ఆస్పత్రి ఏర్పాటు నేపథ్యంలో 15 కంప్యూటర్లు వచ్చాయని.. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షల నిమిత్తం యంత్రాలను కొనుగోలు చేయాలని, విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని, కొత్త బోరు, శుద్ధజల యంత్రాన్ని సమకూర్చాలని, అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ మల్లికార్జున్, తహసీల్దార్ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, వైద్యుడు అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.


