నారాయణపేట: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, చేనేత సొసైటీల్లో జరుగుతున్న అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని అఖిలపక్ష నేతలు, చేనేత కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం జిల్లాకేంద్రంలోని 16వ వార్డు మడి ప్రాంతంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. చేనేత సొసైటీల్లో ఇప్పటి వరకు రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలపై వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని, నేతన్న చేయూత బీమా పూర్తిస్థాయిలో అందడం లేదని తెలిపారు. సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, జౌళిశాఖ అధికారులు కుమ్మక్కవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. నేతన్న పొదుపు పథకం జియో ట్యాగింగ్ ప్రక్రియలో సొసైటీ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం కాపాడాలని, సొసైటీల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, అర్హులైన కార్మికులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు కెంచి నారాయణ, ఎస్సీ ఉపకులాల రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు సల్ల వెంకటేష్, బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి అశోక్, మదర్ థెరిస్సా సొసైటీ అధ్యక్షుడు యూసుఫ్ తాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుల్జారామ్, సీపీఎం పట్టణ నాయకుడు నరహరి, చేనేత కార్మిక సంఘం పట్టణ నాయకులు యాబన్న చౌదరి, వద్ది నారాయణ, తగడఘర్ ప్రకాష్‌రావు, తగడఘర్ పుండరిక్‌రావు, శ్రీకాంత్, చిన్నజట్రం సిరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


