చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

నారాయణపేట: చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్రీడలశాఖ సహకారంతో కౌమారదశ బాలికల జిల్లాస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆమె హాజరై సరస్వతిదేవి, హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటాలకు పూజలు చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల క్రీడా వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని క్రీడలు నేర్పిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడిలో పట్టుదల, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఓటమిని స్వీకరించి దాని నుంచి పాఠాలు నేర్చుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అన్నారు. ఆడ పిల్లలను రక్షించడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించి అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని, బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యల నిర్మూలనలో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం పుర చైర్‌పర్సన్‌తో కలిసి ధన్వాడ, మక్తల్‌ మక్తల్‌ కేజీబీవీ జట్ల మధ్య నిర్వహించిన కబడ్డీ పోటీని కలెక్టర్‌ స్వయంగా ఆడి ప్రారంభించారు. అలాగే నర్వ కేజీబీవీ, నర్వ జ్యోతిబాపూలే కళాశాల బాలికల జట్ల మధ్య ఖో–ఖో పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీల్లో జిల్లాలోని 25 జూనియర్‌ కళాశాలలు, 4 డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 600 మంది బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా సత్యయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివరెడ్డి, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్‌, డీవైఎస్‌ఓ వెంకటేష్‌శెట్టి, సీడబ్ల్యూసీ చైర్మన్‌ అశోక్‌ శ్యామల, డీసీపీఓ కరిష్మా, కౌన్సిలర్లు సత్యమ్మ, నాగమ్మ, కల్పన, గొల్ల రవితేజ యాదవ్‌, రాము, ప్రభాకర్‌, రాజేశ్‌ ఘట్‌, పీఈటీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement