ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

నారాయణపేట: చెక్‌బౌన్స్‌ కేసుల పరిష్కారం కోసం నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహణపై ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, బ్యాంకు అధికారులతో ఆమె కోర్టులో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్‌ 21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, జిల్లావ్యాప్తంగా రాజీ చేసుకునే అవకాశం ఉన్న 152 పెండింగ్‌ చెక్‌బౌన్స్‌ కేసులను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీమార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. లోక్‌ అదాలత్‌తో కక్షిదారుల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసులను సులభతరంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు, కక్షిదారులు, బ్యాంకు అధికారులు, సంబంధిత వర్గాలు తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయపరమైన సలహాలు, సందేహాలు లేదా ఉచిత న్యాయ సాయం అవసరమైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. లోక్‌ అదాలత్‌కు సంబంధించిన మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 15100 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సాయి మనోజ్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.అవినాష్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మాగనూర్‌: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి జిల్లా మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి గణేష్‌సింగ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్టీ (హిందీ) పోస్టు ఖాళీగా ఉందని.. డిగ్రీ, బీఈడీ పూర్తిచేసిన వారు 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో కూడిన బయోడేటాను స్వయంగా పాఠశాలలో అందజేయాలని సూచించారు.

డీఈఓ ఆకస్మిక తనిఖీ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని వేదాంత విద్యాలయం, బ్రిలియంట్‌, శ్రీ చైతన్య, లిటిల్‌స్టార్‌, శ్రీసాయి తదితర ప్రైవేట్‌ పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు, ఎంఈఓ బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, టాయిలెట్స్‌, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement