నీటి సంరక్షణకు ప్రాధాన్యం
నారాయణపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే లే అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. సోమవా రం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా లే అవుట్ కమిటీ సమావేశం నిర్వహించగా.. జిల్లా లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆరు లే అవుట్ల దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ వివరాలపై ఆరా తీశారు. కమిటీ పరిశీలన అనంతరం మూడు లే అవుట్లకు అనుమతులు మంజూరు చేయగా.. మరో మూడు దరఖాస్తులను తిరస్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ అనుమతుల ప్ర క్రియలో అధికారులు పూర్తి స్థాయి జాగ్రత్తలు పా టించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ అశోక్, నీటిపారుదల శాఖ ఈఈ సాల్మన్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, డీటీసీపీఓ కిరణ్, కోస్గి, మక్తల్, మద్దూరు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలును వేగవంతం చేసి, నిర్ధేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో వివిధ కార్య క్రమాలపై నిర్వహించిన సమీక్ష మాట్లాడుతూ.. ఆగస్టు 25న నిర్వహించనున్న వన మహోత్సవంలో మండల, గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. చేయూత పథకంలో అర్హుల నమోదును ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
డీసీహెచ్‌బీ 2027 డేటా..
జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని డీసీహెచ్‌బీ–2027 కు సంబంధించిన డేటా సేకరణ, నమోదు ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఓలు, వీఓఏలు తమ పరిధిలోని పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అభ్యసకుల శిక్షణ, అభ్యసన ప్రక్రియ పూర్తైన అనంతరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వారికి సర్టిఫికెట్లు అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాల యూనిఫాంల తయారీకి అందిన మెటీరియల్‌తో వీఓఏలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కుట్టు పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు వ్యవసాయ చెరువుల పనులను చేపట్టి పూర్తి చేయడంతో పాటు, 50 నుంచి 100 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


